తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమ్మాపురం చేరుకున్న రేవంత్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎం రేవంత్‌కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు.దర్శనం కంటే ముందు.. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో రూ. 110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడుకొండల మధ్యలో ఉన్న కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి ఆలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో నేడు ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ పనులు ప్రారంభించారు.
