కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగా సాధన కోసం ప్రత్యేకంగా తరగతులను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్వతో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్య సంపదను అందిస్తున్నామని అన్నారు. అనంతరం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 13 సంవత్సరాల నుంచి యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందమందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని అన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు కేరళలో జరగబోయే 49వ జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కల్లూరు ఏం.ఈ.ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను యోగ సాధన వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు యోగాలో సాధన చేయిస్తే క్రమశిక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వేదాన్షి పాఠశాల కి రెస్పాండెంట్ పరమేష్, అనంతపూర్ జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ యోగ సంఘం టెక్నికల్ అఫీషియల్స్ డాక్టర్ ముంతాజ్ బేగం,విజయ్ కుమార్,ఈశ్వర్ నాయుడు,జిల్లా సంఘం ప్రతినిధులు ఫయాజ్,పద్మలత, పోటీల నిర్వాహక అధ్యక్షుడు విద్యాసాగర్, వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
