గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు. గత రెండేళ్లుగా ఆమెతో సాన్నిహిత్యంగా ఉండి ఇప్పుడు మొహం చాటేసాడు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న మహిళ తో కాపురం చేసేదే లేదని బెదిరిస్తున్నాడు. అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
నిత్యం ఎక్కడో చోట మహిళలను మోసం చేసిన వార్తలు వింటూనే ఉంటాం. ప్రస్తుతం సమాజంలో ఈ అంశం నిత్య కృత్యమైంది. ఇలాంటి వంచనే అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది. 24వ సచివాలయంలో వీఆర్వో గా పని చేసే వలి ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం వచ్చిన ఓ మహిళను మాయమాటలతో నమ్మించారు. కల్లబొల్లి మాటలు చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే తనకు పెళ్లి అయినట్టు బాధితురాలికి చెప్పకుండా గుట్టుగా వ్యవహారం నడిపాడు. అయితే అవసరం తీరిపోయాక ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న బాధితురాలిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చంపుతామని కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఇప్పుడు తన భార్య ఒప్పుకోవడం లేదని బుకాయిస్తున్నాడు. దీంతో చేసేది లేక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సురేష్ నేతృత్వంలో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని.. నమ్మించి మోసం చేసిన విఆర్ఓ వలితోపాటు తనను చంపుతామని బెదిరిస్తున్న వలి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ మనోహర్ బాధితురాలికి హామీ ఇచ్చారు.
న్యాయం జరిగే వరకూ పోరాటం: సురేష్
పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఏడు నెలల గర్భవతిగా ఉన్న బాధితురాలిని వదిలించుకునేందుకు వీఆర్వో వలి ప్రయత్నిస్తున్నాడని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా సహాయం చేస్తా వదిలిపెట్టాలని పెద్ద మనుషుల ద్వారా వీఆర్వో వలి దుప్పటి పంచాయతీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అవసరమైతే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మహిళలను మోసం చేసిన వీఆర్వో వలీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.