Telugu Times

ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…?

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం అమలులోకి రానుంది. ఈ సందర్భంగా పార్కింగ్ రుసుముల వసూలును నియంత్రించేందుకు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని సోమవారం స్పష్టం చేశారు. ఈ నియమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద వాహన పార్కింగ్ ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇష్టానుసారంగా రుసుములు వసూలు చేయకుండా నియంత్రణలు విధించింది. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఈ విషయంలో ఎప్పుడు, ఎలా రుసుములు వసూలు చేయాలో నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మల్టీప్లెక్స్‌లు మరియు మాల్స్‌లో 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు వాహనాలు పార్క్ చేసినప్పుడు, ఆ సమయంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయరని తెలిపారు. అయితే, బిల్లు చూపించలేని వారి నుంచి మాత్రం పార్కింగ్ రుసుములు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఒక గంటకు మించి పార్కింగ్ చేసిన వారు సినిమా టికెట్ లేదా ఇతర బిల్లులు చూపిస్తే కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎలాంటి ఆధారాలు చూపని వారి నుంచి రుసుములు వసూలు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ రుసుముల మొత్తం ఎంత ఉండాలనే విషయంపై పురపాలక శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ నియమాలను వాహనదారులు గమనించాలని అధికారులు కోరారు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20