కర్ణాటకలో పవర్ షేరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సీఎం సీటులో కూర్చోబెట్టింది. డీకేకు మాత్రం డిప్యూటీ సీఎం పీఠాన్ని కట్టబెట్టింది.అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై అప్పట్లో పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక లేటెస్ట్గా అధికార మార్పిడిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో రహస్య ఒప్పందం కుదిరినట్లు వస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. అధికార పంపిణీ ఒప్పందం జరిగిన విషయం వాస్తవమే. ఆ వివరాలను బహిర్గతం చేయలేనన్నారు. దీనిపై అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేయనన్న ఆయన.. పార్టీకి విధేయుడిగానే ఉంటానన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, తనకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.
ఇటు శివకుమార్ వ్యాఖ్యలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. అధికార పంపిణీకి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మొత్తంగా… ఒకరేమో అధికార పంపిణీ ఒప్పందం జరిగిందంటారు..! మరొకరు అలాంటిదేం లేదంటారు..! మరి ఇద్దరి వాదనలపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అన్నదీ ఇంట్రెస్టింగ్గా మారింది